Ads
ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి హిట్ అయిన సినిమా డీజే టిల్లు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : టిల్లు స్క్వేర్
- నటీనటులు : సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్.
- నిర్మాత : సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
- దర్శకత్వం : మల్లిక్ రామ్
- సంగీతం : రామ్ మిరియాల, అచ్చు రాజమణి
- విడుదల తేదీ : మార్చి 29, 2024
స్టోరీ :
బాలగంగాధర్ తిలక్ అలియాస్ డీజే టిల్లు (సిద్దు జొన్నలగడ్డ) వచ్చిన డబ్బులన్నిటితో డీజేగా తను చేసే పని మానేసి, ఒక ఈవెంట్ కంపెనీ పెడతాడు. ఈవెంట్ ప్లానర్ అవతారం ఎత్తి అన్ని రకాల ఈవెంట్స్ జరిపిస్తూ ఉంటాడు. పార్టీలో కనిపించిన లిల్లీ (అనుపమ పరమేశ్వరన్) తో వెనకాల పడతాడు. కానీ తర్వాత అనుకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అసలు లిల్లీ ఎవరు? తర్వాత టిల్లు వెనకాల ఎందుకు పడింది? మధ్యలో వచ్చే డాన్ (మురళీ శర్మ) తో టిల్లుకి ఏం కనెక్షన్ ఉంటుంది? గత సంవత్సరం టిల్లు పుట్టినరోజు నాడు జరిగిన విషయం మళ్ళీ ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చింది? ఇదంతా తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
నటులకి అసలైన సక్సెస్ అనేది కలెక్షన్స్ పరంగా మాత్రమే కాదు. వాళ్లు ఏదైనా ఒక పాత్ర చేస్తే, ఆ పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతే, ఒకవేళ వాళ్ళు బయటికి వెళ్లినా కూడా వాళ్ళని అదే పాత్రతో పిలిస్తే అప్పుడు వారికి సక్సెస్ వచ్చినట్టు. ఇప్పుడు డీజే టిల్లు అనే పేరుతోనే సిద్దు జొన్నలగడ్డ చాలా ఫేమస్ అయ్యారు. కలర్ ఫుల్ బట్టలు, మామూలు దుస్తులకి అంతర్జాతీయ బ్రాండ్ లేబుల్స్ అంటించడం, తన కాలనీలో తనని ఎవరూ పట్టించుకోకపోయినా కూడా తనకి చాలా పాపులారిటీ ఉన్నట్టు బిల్డప్ ఇవ్వడం, అమ్మాయిల దగ్గర అల్లు అర్జున్ తనని తన నెక్స్ట్ సినిమాకి అడిగారు అని చెప్పడం, ఇవన్నీ టిల్లు చేసిన పనులు.
వాటి నుండి టిల్లు ఎదుర్కొన్న సంఘటనలు ప్రేక్షకులని నవ్వించాయి. కానీ జీవితంలో అన్ని చూసినా కూడా మనిషి మారకపోతే ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అనేది ఈ సినిమాలో చూపించారు. స్టోరీ లైన్ విషయానికి వస్తే కొంత వరకు తెలిసిన కథ. టేకింగ్ పరంగా బాగుంది. కాకపోతే స్క్రీన్ ప్లే సాధారణంగా అనిపిస్తుంది. సినిమా తీసిన విధానం మాత్రం మొదటి భాగం లాగానే ఉంటుంది. అంటే అదే టెంప్లేట్ ఫాలో అయ్యారు.
Ads
కొన్ని సీన్స్ అయితే రిపీట్ అయినట్టు అనిపిస్తాయి. కానీ మొదటి భాగంలో అవన్నీ హిట్ అవ్వడంతో ఇందులో కూడా అవి రిపీట్ చేయాలి అని అనుకున్నట్టు తెలుస్తోంది. సినిమాలో వన్ లైనర్స్ చాలా బాగా రాసుకున్నారు. కొన్ని ట్విస్ట్ సీన్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని మనం గెస్ చేసేలాగా ఉన్నాయి. కొన్ని మాత్రం కొత్తగా ఉన్నాయి. క్లైమాక్స్ అసలు ఏ ఉద్దేశంతో పెట్టారు అనేది అర్థం కాదు. అంటే అప్పటి వరకు కామెడీగా వెళుతున్న సినిమా సడన్ గా క్లైమాక్స్ ఎపిసోడ్ తో సీరియస్ అవుతుంది. కానీ ఆసక్తికరంగా అనిపిస్తుంది.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ అన్ని డీజే టిల్లు అలియాస్ సిద్దు జొన్నలగడ్డ. ఈసారి ఇంకా కలర్ ఫుల్ బట్టలతో, కొత్త కొత్త ఇబ్బందులతో అందరినీ నవ్వించారు. సినిమా మొత్తంలో సిద్ధూ మాత్రమే కనిపించారు. అనుపమ పరమేశ్వరన్ ఇప్పటి వరకు పోషించని ఒక కొత్త పాత్ర పోషించారు. గ్లామరస్ గా కనిపించడంతో పాటు, నటన పరంగా కూడా అనుపమ పాత్ర బాగా రాసుకున్నారు. టిల్లులో కనిపించిన మెయిన్ క్యారెక్టర్, రాధిక అక్క కూడా కనిపిస్తారు.
తనకి ఇచ్చిన చిన్న పాత్రలో నేహా శెట్టి బాగా నటించారు. ఇంకా మొదటి భాగంలో ఉన్న చాలా మంది, వారితో పాటు ఇప్పుడు వచ్చిన మురళీ శర్మ వంటి వారు కూడా చాలా బాగా నటించారు. రామ్ మిరియాల, అచ్చు రాజమణి అందించిన పాటలు బాగున్నాయి. టెక్నికల్ గా సినిమా చాలా బలంగా ఉంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. కాకపోతే మొదటి భాగం చాలా బాగా చూసిన వారికి ఇందులో కొన్ని సీన్స్ రిపీట్ చేసినట్టు అనిపిస్తాయి. అవి కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- సిద్దు జొన్నలగడ్డ నటన
- వన్ లైనర్స్
- కామిడీ ట్రాక్
- పాటలు
మైనస్ పాయింట్స్:
- బలహీనమైన కథనం
- ఎక్కువగా అనిపించే మొదటి భాగం రిఫరెన్స్ లు
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా అవన్నీ పెద్దగా పట్టించుకునే అంత లేవు. వాటన్నిటి కంటే మంచి కామెడీ ఈ సినిమాలో ఉంది. మొదటి భాగం ఎంజాయ్ చేసిన వారు ఈ సినిమాని అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. థియేటర్ లో 2 గంటల పాటు హాయిగా నవ్వుకుంటారు. డీజే టిల్లు సినిమాతో ఎన్ని అంచనాలు అయితే క్రియేట్ చేశారో ఈ సినిమాతో అవన్నీ కూడా అందుకున్నారు. ఈ సంవత్సరం వచ్చిన బెస్ట్ ఎంటర్టైనర్ సినిమాగా టిల్లు స్క్వేర్ సినిమా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : వారసుడు సినిమాలోని ‘రంజితమే’ పాటలో హీరోయిన్ రష్మిక కన్నా ఎక్కువగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ గురించి తెలుసా?