Ads
గత నాలుగు రోజులుగా హైదరాబాద్ లో ఏ నోట విన్నా ఒకటే మాట.. లులు మాల్. హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో కొత్తగా ప్రారంభించిన ఈ మాల్ పై జనం దండయాత్ర చేశారు. కేవలం ఈ మాల్ ని చూడడానికి వస్తు పోతున్న జనంతోటి ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ కి కొన్ని గంటల పాటు అంతరాయం కలిగింది.. కలుగుతోంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ మాల్ లోపలికి వెళ్ళిన కస్టమర్స్ మాత్రం లొల్లి ..లొల్లి చేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తిని పడేసిన చిప్స్ ప్యాకెట్లు ,సగం తాగి వదిలిపెట్టిన కూల్ డ్రింకులు ,అస్తవ్యస్తంగా తయారైన ఫుడ్ కోర్ట్… ఇది మోస్ట్ ప్రిస్టేజియస్ లులు మాల్ ప్రస్తుత పరిస్థితి. మాల్ లోపల ఇసుక వేసిన రాలనంత జనం కారణంగా భద్రతా చర్యలు తీసుకోవడం కష్టమైపోయింది. దీనికి తోడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ హెవీ ట్రాఫిక్ వీడియోలు పెట్టి అరే ఎవర్రా మీరంతా అంటూ డైలాగులు జోడించి రీల్స్ చేసి వదులుతున్నారు.
Ads
అయితే ఈ ట్రాఫిక్ కారణంగా హాస్పిటల్స్ కి ఎమర్జెన్సీ కోసం వెళ్లాల్సిన పేషంట్లకి కూడా ఆలస్యం అయిపోతుందని కూకట్ పల్లికి చెందిన ఒక ప్రముఖ వైద్యుడు ట్విట్టర్ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు. జనం ఎక్కువగా ఉండడంతో కట్టడి చేయడం కష్టమైంది.. ఇంకేముంది ఫ్రీగా తినాలి అనుకున్న వాళ్లు జనంలో చేరిపోయి హ్యాపీగా చేతికి అందినవి తిని ఖాళీ ప్యాకెట్లు అక్కడే పారేసి పోతున్నారు. వీటికి సంబంధించిన రీల్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. దీంతో లులు మాల్ అనుకున్న దానికి భిన్నంగా వేరొక విధంగా వైరల్ అయింది. ఇది మొదటి సారి ఏమీ కాదు.
అంతకుముందు కూడా హైదరాబాద్ లో ఓపెన్ అయిన కొన్ని మాల్స్ లో ఇలాగే జరిగాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయి ఏదో హైదరాబాద్ తెగ ఫేమస్ అయ్యింది అని సంబరపడిపోతున్నాం కానీ ఇలా చేసి మన పరువు మనమే తీసుకుంటున్నాం అని ఈ వీడియో చూసిన చాలామంది అంటున్నారు. ఇక్కడికి వెళ్లిన జనాలు అందరూ చేశారు అని, ఏదో ఒక వింత ప్రపంచానికి వెళ్ళినంత అత్యుత్సాహంతో ప్రవర్తించారు అని అంటున్నారు.