Ads
భార్య భర్తల మధ్య గొడవలు వస్తే విడాకులు తీసుకుంటారు. అయితే విడాకులు తీసుకోవడానికి బలమైన కారణం ఉండాలి. కానీ ఇటీవల కాలంలో విడాకుల సంఖ్య పెరిగింది. చిన్న చిన్న వాటికి కూడా విడాకులు తీసుకుంటున్నారు. కొన్ని కారణాలు అయితే వినడానికి కూడా అర్థం అవ్వకుండా ఉంటాయి. ఒకరితో ఒకరు కలిసి ఉండలేనప్పుడు విడాకులు తీసుకోవడమే నయం. కానీ అసలు ఇప్పటి కాలం వారు కలిసి ఉండే ప్రయత్నం కూడా చేయట్లేదు అని నిపుణులు చెప్తున్నారు. అభిప్రాయ బేధాలు వస్తాయి. గొడవలు అవుతాయి.
కానీ గొడవలు అయ్యాక తర్వాత ఏం చేయాలి అనే విషయాల గురించి పరిష్కారం వెతికేవారు తక్కువగా ఉంటున్నారు. గొడవ అవ్వగానే విడిపోవాలి అని అనుకుంటున్నారు. విడిపోవడానికి అతి ప్రేమ కూడా కారణంగా మారుతోంది. అవసరానికి మించి ఎక్కువగా భాగస్వామి మీద ప్రేమ చూపించడం కూడా ఎక్కువ మందికి నచ్చట్లేదు. అయితే మరి అతిగా ప్రేమ చూపించడం, లేదు అంటే అసలు పట్టించుకోకపోవడం అన్నట్టుగా ఈ కాలం వారు ఉంటున్నారు. బ్యాలెన్స్ అనేది చాలా మందిలో లేకుండా ఉంది. అందులోనూ ముఖ్యంగా ఈగో వల్ల చాలా మంది విడిపోతున్నారు.
Ads
ఒక మనిషి అహంకారం ఆ మనిషి పతనానికి దారితీస్తుంది. ముఖ్యంగా ఒక రిలేషన్ షిప్ లో అహంకారం ఉండడం అనేది మంచిది కాదు. కానీ యువతరంలో అహంకార భావం ఎక్కువగా ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు. వాళ్ళ అహంకారాన్ని వాళ్లు గొప్ప విషయంగా అనుకుంటున్నారు అని, ఆత్మగౌరవానికి, అహంకారానికి తేడా తెలియట్లేదు అని అంటున్నారు. అవతలి వారు ఏదైనా ఒక చిన్నమాట అంటే తమ అహంకారానికి అది తగిలినట్టుగా అనిపిస్తే, అదే వారు అవమానంగా భావించి విడాకులు తీసుకుంటున్నారు. అహంకారాన్ని పక్కన పెట్టి, అవతలి వారు చెప్పేది వినడానికి ప్రయత్నించట్లేదు.
ఒక మనిషి కొన్ని విలువలని వదులుకోవడం కష్టం. అలాంటివి వదులుకోవాల్సి వచ్చినప్పుడు విడాకులు తీసుకోవడం సరైన నిర్ణయం. చిన్న చిన్న వాటికి అహంకారానికి తీసుకొని, అప్పుడు విడాకులు తీసుకుంటే మాత్రం అది సరైన నిర్ణయం కాదు అని అంటున్నారు. విడాకులు తీసుకోవడానికి ముఖ్య కారణం ఎక్కువగా అహంకారం వల్ల వచ్చే గొడవలే అవుతున్నాయి అని మానసిక నిపుణులు చెప్తున్నారు. అది తగ్గించుకుంటే, గొడవలు చాలా వరకు పరిష్కారం అవుతాయి అని అంటున్నారు. అప్పుడే యువతరంలో విడాకులు తీసుకోవాలనే ఆలోచనలు తగ్గుతాయి అని చెప్పారు.